కొద్ది నెలల క్రితమే సైకిల్ వదిలి కారెక్కిన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం ఏమిచేస్తున్నారు?..... ఈ ప్రశ్నకు జవాబు దొరకటం కొంచెం కష్టమే! చిరకాల మిత్రుడైన తుమ్మలకు ఎన్నికలకు ముందే కెసిఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు... తెరాస ఉపాధ్యక్ష పదవి ఇచ్చి, శాసనసభ ఎన్నికలలో తనుకోరుకున్న చోట సీటు, తనవారు మరో నలుగురికి కూడా సీట్లు ఇస్తానని ఆఫర్ చేసాడు, కాని అప్పటికి తెరాస గెలుపు మీద, కెసిఆర్ మాట మీద నమ్మకం లేని తుమ్మల ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించాడు. అంతకు ముందే జరిగిన జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న ఊపులో ఉండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం తమదే అన్న ధీమాలో ఉన్న తుమ్మల ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో తనదే పైచేయిగా భావించాడు...
శాసనసభ ఎన్నికల్లో తన సీటుకు ఎసరు వస్తుందని కాని, తన వర్గం వాళ్లకు సీట్లు ఇప్పించుకోలేని పరిస్థితి వస్తుందని కాని ఉహించని తుమ్మల తదనంతర పరిణామాలతో ఖంగు తిన్నాడు. శాసనసభ ఎన్నికల సీట్ల పంపకంలో నామా నాగేశ్వరరావుదే పై చేయి అయింది, ఇద్దరూ ఆ ఎన్నికల్లో ఒకే పార్టీలో ఉన్నాకాని బద్ధ శత్రువుల్లా వ్యవహరించి ఒకరి నొకరు దెబ్బ తీసుకుని వారిరువురు, ఇరువురి అనుచరులు ఓడిపోవటంతో పాటు పార్టీని కూడా ఘోరంగా దెబ్బతీసారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న 'ఖమ్మం' పార్లమెంట్, ఖమ్మం అసెంబ్లీ, వైరా, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధుల ఓటమికి ఈ ఇద్దరే కారకులయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీపై తుమ్మల తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడని భావించినా, కాంగ్రెస్ వ్యతిరేక నేపధ్యం నుండి వచ్చి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే ఉండి జిల్లాలో ముఖ్యమైన పదవులతో పాటు, మంత్రిగా పనిచేసిన తుమ్మల మాత్రం ఎంతో సంయమనం పాటించాడు. ఒకరకంగా నామా నాగేశ్వర రావు మూర్ఖత్వంతో ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా పతనం అయింది.
తెలుగుదేశం పార్టీలో తుమ్మలకు ఏనాడు అన్యాయం జరుగలేదు.. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష పదవి, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ వంటి ముఖ్యమైన పదవులన్నింటిని చంద్రబాబు నాయుడు తుమ్మల వర్గం వారికే కట్టబెట్టాడు. ఖమ్మం జిల్లలో కమ్యునిస్టుల ప్రాబల్యానికి చెక్ పెట్టి, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎదగటానికి తుమ్మల చేసిన కృషి అమూల్యం, ఈ విషయం గుర్తించిన చంద్రబాబు తుమ్మలకు ఎంతో గౌరవం ఇచ్చినా కాని, 2014 ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కు ఇచ్చిన ప్రాధాన్యతకు తుమ్మల అహం దెబ్బతింది.
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇప్పుడప్పుడే కోలుకొనే అవకాశం లేదని గ్రహించిన తుమ్మల ఈ సారి తెరాస అధినేత, ముఖ్యమంత్రి , చిరకాల స్నేహితుడైన చంద్రశేఖర రావు ఈసారి ఇచ్చిన బంపర్ ఆఫర్ను వదలుకోలేకపోయాడు. జంట నగరాలతో పాటు, ఇతర తెలంగాణా జిల్లాల్లో (ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాదు) కనీసం 40 స్థానాల్లో గెలుపోటములపై ప్రభావం చూపించగలిగిన సంఖ్యలో ఉన్న కమ్మవారి ఓట్లు, ఆకర్షించే వ్యూహంలో భాగంగా, మరియు ఖమ్మం జిల్లాలో కేవలం తన సామాజిక వర్గం వారే కాకుండా అన్ని ఇతర వర్గాల్లో మంచి పట్టున్న తుమ్మలకు, కెసిఆర్ 'కేబినేట్ మంత్రి' పదవి ఆఫర్ చేశాడు, రెండో సారి మళ్లీ తలుపు తట్టిన అదృష్టాన్ని వదలుకోటానికి ఇష్టం లేని తుమ్మల తన భారీ అనుచర గణంతో పాటు అయిష్టంగానే అయినా అట్టహాసంగా తెరాస పార్టీలో చేరాడు. అదే సమయంలో తెలుగుదేశం అధినేతపై వ్యక్తిగతంగా కాని, తీవ్ర పదజాలంతో కానీ విమర్శలు చేయకుండా కొంత విజ్ఞత తో వ్యవహరించాడు.
తుమ్మలను అక్టోబర్ ఆఖరు లేదా నవంబర్లో మంత్రివర్గంలోకి తీసుకుంటారని, ఆ తరువాత నిజామాబాదు నుండి శాసన మండలికి ఎంపిక చేస్తారని తెరాస పార్టీలో, వార్తా పత్రికల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తలను తెరాస వర్గాలు కాని, తుమ్మల కాని ఖండించలేదు సరికదా!, అనధికారంగా అంగీకరించటం జరిగింది.
తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చే ముందు త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్న జంటనగరాలతో పాటు , తెలంగాణా జిల్లాల్లో తన సామాజిక వర్గం నాయకులు కొందరినైనా తెరాస పార్టీలోకి కెసిఆర్ షరతు పెట్టాడు. ఆ క్రమంలో తుమ్మల ఖమ్మం జిల్లా మరియు ఇతర తెలంగాణా జిల్లాల్లో తన వర్గం వారికి నచ్చజెప్పి కొందరిని తెరాస వైపు మళ్లించటంలో సఫలీకృతుడైనా... జంట నగరాల్లో తన వర్గం శాసన సభ్యులపై కాని, కార్పొరేటర్ల పై కాని పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. జంట నగరాల్లో స్థిరపడ్డ ఆ వర్గంవారికి తెరాస పార్టీపై వ్యతిరేకత లేకపోయినా... కెసిఆర్ ను మాత్రం పూర్తిగా నమ్మలేకపోతున్నారు. చెప్పేది చేయకపోవటం, చేసేది చెప్పకపోవటం, మాట మీద నిలబడే రకం మనిషి కాకపోవటం (గతంలో తెలంగాణలో తెరాస పార్టీ అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని, తెలంగాణా ఇస్తే తెరాస పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఎన్నో సందర్భాల్లో ప్రకటించిన కెసిఆర్.. తెలంగాణా రాష్ట్రం ప్రకటించిన తరువాత కాని, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత కాని తన హామీలను అమలు చేయకుండా వక్రభాష్యాలు వల్లెవేశాడు) వంటి కారణాలతో కెసిఆర్ పైన ఆ వర్గం వారికే కాక ఏ వర్గం వారికి నమ్మకం కుదరటంలేదు. ఒకవేళ కెసిఆర్ తన మాట మీద నిలబడి తుమ్మలకు మంత్రి పదవి కట్టబెట్టిన పక్షంలో ఆయన సామాజిక వర్గానికి చెందివారు ఎందరో తెరాస పార్టీకి మద్దతివ్వటానికి సిద్ధంగా ఉన్నారు.
సమీప కాలంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవటం... పైగా తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చినా కాని ఇప్పటికిప్పుడు పార్టీకి వచ్చే ప్రయోజనం ఏదీ లేకపోవటం వంటి కారణాలతో కెసిఆర్ తుమ్మలకు మంత్రి పదవి అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని తెరాస వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఖమ్మం జిల్లాకే చెందిన కెసిఆర్ సామాజిక వర్గానికి చెందిన ఏకైక శాసనసభ్యుడు, రాజకీయాల్లో తుమ్మలకు గత మూడు దశాబ్దాలుగా ప్రత్యర్ధి 'జలగం వెంకటరావు' కూడా అడ్డుపుల్ల వేశారని వినికిడి.
ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస శ్రేణులు ఇంతవరకు తమ జిల్లా వారెవరికి మంత్రి వర్గంలో స్థానం కల్పించకపోవటం పైనా, తుమ్మలకు మంత్రి పదవి పైనా పార్టీ అధిష్టాన వర్గానికి ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా వారిని నుండి స్పందన కరువైంది. దీంతో తుమ్మల వర్గం ఆయనకు మంత్రి పదవిపై ఆశలు వదిలేసుకొని 'నిండా మునిగిన వాడికి చలేంటి!' అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలే నెరవేర్చని కెసిఆర్ వ్యక్తులకిచ్చిన హామీలు నేరవేరుస్తాడని అనుకోవటం నిజంగా అవివేకమే!
Comments