ప్రకృతి సౌందర్యం అంతా పల్లెల్లోనే ఉంది. పచ్చటి పొలాలు, కొబ్బరి, తాటి, ఈత చెట్లు, పిల్ల కాలువలు, చెరువులు, పశువులు... ఇలా ఒక అందమైన చిత్రీకరణ ఒక్క పల్లెటూర్లలోనే ఆవిష్కృతమౌతుంది. శీతాకాలం (శరదృతువు) లో పల్లెటూళ్ళ అందం వర్ణించ నలవి కాదు... కోతకు వచ్చిన వరి పొలాలు, కోసిన వరి కుప్పలు, పొలాల్లో వడ్ల పురులు.. వెరసి, రైతుల కళ్ళల్లో బిడ్డ పుట్టినంత ఆనందం (ఆరుగాలం పంట అక్కరకు వచ్చినందుకు)....
ఒక్కసారి 'మంచు దుప్పటి' కప్పుకున్న ఆ పచ్చటి పొలాలను కాలువ గట్ల పైనుండి నడచి వెళ్లి పలకరించండి... ఎడ్ల బండిపై మట్టి రోడ్డు మీద మీ తండ్రి, తాత గారి ఊరుని ఒక సారి చుట్టి రండి... నిజం చెప్పండి, మనం బ్రతికేది ఒక బ్రతుకేనా అనిపించటం లేదు?
ఉదయం లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుగుల జీవితం, ట్రాఫిక్ జాములు, వాతావరణ, శబ్ద కాలుష్యం, కొంచెం సేపు ఆగి విశ్రాంతి తీసుకుంటే, ఎక్కడ వెనకబడి పోతామో అన్న బ్రతుకు పోరాటం... పక్క వాడిని దాటి ముందుకు వెళ్ళాలన్న ఆరాటం, డబ్బులు కూడబెట్టలన్న ఆశ, ఇవన్నీ మనకు AC గదుల్లో కూడా ఉపిరాడకుండా చేస్తున్నాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ లేకుండా నిముషం గడవదు, ముద్ద దిగదు.
ఇక పిల్లలైతే మరీను! మేలుకున్న దగ్గర నుండి నిద్ర పోయేవరకు చదువు.. చదువు.... ఖాళి దొరికినప్పుడు పేస్ బుక్, లేకపోతె Whatsap . రోజు తినే బియ్యం, కూరగాయలు, పప్పు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియదు. ఎడ్లు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు టీవీ లో తప్ప ఎన్నడు నిజ జీవితంలో చూసి యెరుగరు...
ఇది కాదు జీవితం. రండి... పల్లె పిలుస్తుంది, ఒక్కసారి మన పల్లె పిలుపుకు ప్రతిస్పందించండి. చనిక్కాయలు, చెరుకు గడలు, మొక్కజొన్న కండెలు, మీగడ పెరుగు మీకోసం ఎదురు చూస్తున్నాయ్.
Comments