పట్టణంలో ఏముంది? ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములు, వాహనాల రొద, శబ్ద, ధ్వని కాలుష్యం, దుమ్ము, ధూళి, కార్బన్ డై ఆక్సైడ్ కంపు తప్ప!
కోకిలల కుహు కుహు రాగాలు, కోడిపుంజుల 'కొక్కొరోకో' సంగీతాలు, పిచ్చుకమ్మల కిచ కిచలు నగరాల్లో మీకెప్పుడైనా వినిపించాయా?
చెంగున గెంతే కోడె దూడలు, డీ కొడదాం రమ్మనే గొర్రె పొట్టేళ్ళు, అందమైన గోమాతలు, యవ్వనం ఉట్టిపడే గిత్తలు పట్టణాల్లో మీకెప్పుడైనా కనిపించాయా?
ఊర చెరువులో విరబూసిన కలువ, తామరలు, పిల్లకాలువల్లో కాళ్ళకు తగులుతూ గిలిగింతలు పెట్టె మట్టగుడిసెలు, కాలువ గట్లపై విరగ బూసిన పొగడ పూల చెట్లు నగరాల్లో మీరెప్పుడైన చూశారా?
పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్స్, తట్టుకోలేనంత కొవ్వు, భరించలేనంత అనారోగ్యం. ఘాటైన పాయిసన్ సెంట్లు, అలేర్జిలు, తుమ్ములు, హోస్పటల్లు, డాక్టర్లు ఇదేనా నగర జీవితం?
తొలకరి చినుకుల మైమరపించే మట్టి వాసన, మత్తెకించే వేప పూల, విరిసిన బంతిపుల కమ్మటి సువాసన, తంపటివేసిన తేగల, కుంపట్లో కాల్చిన చిలగడ దుంపల, ఉడకబెట్టిన పచ్చి వేరుశనగ కాయల, నిప్పులపైన దోరగా కాల్చిన మొక్కజొన్న కండెల వాసనలు మీరు అప్పుడే మర్చి పోయారా?
మల్లెపూల వాసన ఆర్చిడ్ పూలకు ఉండదు. ఆర్చిడ్ పూల అందం మల్లెపూలకు ఉండదు, మల్లె మొక్కలు పెరట్లో పెట్టుకుంటాం కానీ ఆర్చిడ్ మొక్కలు కుండిల్లోనే పెంచుతామ్.
పల్లెలు భార్యలు, పట్టణాలు ప్రియురాళ్ళు ... పల్లెల్లో ఉంటూ ఎప్పుడైనా ఒకసారి పట్నం వైపు తొంగి చూడండి కాని పట్టణాలు ప్రపంచం అనుకోకండి....
Comments