ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వటానికి, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల్లో తెలుగుదేశం, భారతీయ జనత పార్టీలే అధికారంలో ఉన్నందువలన 'భారతరత్న' విషయం త్వరగా తేల్చేస్తే బాగుంటుంది.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడే పార్లమెంట్ ప్రాంగణంలో 'ఎన్టీఆర్' విగ్రహం ఏర్పాటు చేశారు, నిజంగా ఇదెంతో గొప్ప విషయమే! పురందేశ్వరి చొరవతోనే ఇది సాధ్యం అయింది. తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో ఏర్పాటైన NDA ప్రభుత్వంలో కూడా ఈ పని చేయలేక పోవటం నిజంగా సిగ్గుచేటు.
ఒక ముఠా నాయకుడిగా తప్ప ముఖ్యమంత్రిగా ఏనాడు పనిచేయని వై. యస్. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి మరణించిన 10 నెలలలోనే కడప జిల్లాకు అయన పేరు పెట్టారు. మరి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చనిపోయిన తరువాత ఎనిమిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కాని 'కృష్ణా జిల్లా' కు ఆయన పేరు పెట్టలేక పోయింది.
తెలుగుదేశం పార్టీ కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయటానికి సరిపడా బలం ఉంది, ప్రతిపక్షం నుండి కాని, కేంద్ర ప్రభుత్వం నుండి కాని ఎటువంటి వ్యతిరేకత, అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం ఇంకెందుకు ఇంతగా తాత్సారం చేస్తుంది?
భారతరత్న విషయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కనుక ఆ విషయం ఇంకొంత కాలం ఆలస్యం అయినా పర్వాలేదు కాని, ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండా 'కృష్ణా జిల్లాకు ' వెంటనే ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలని ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, కృష్ణా జిల్లాకు చెందిన నాయకులు, మంత్రులు ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి, ఆందోళనలు చెయాలి.
శంషాబాద్ విమానాశ్రయం టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టటానికి అభ్యంతరం తెలిపారనే చిన్న విషయంలో మనం తెరాస, కాంగ్రెస్ పార్టీలను తప్పుపడుతున్నాం.... కానీ ఆ మహానుభావుడి విషయంలో మనం చేస్తున్నదేమిటి?
చంద్రబాబు నాయుడు గారూ, మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది ఆ మహానుభావుడి చలువ తోనే అన్న విషయం మర్చిపోకండి. కొత్త సంవత్సరం వచ్చే లోపు ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలోనూ, ఆ మహానుభావుడి జన్మనిచ్చిన కృష్ణా జిల్లాకు అయన పేరు పెట్టే విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకుని అసంఖ్యాకమైన ఎన్టీఆర్ అభిమానులను, రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరుస్తారని ఆశిస్తాము.
జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం!
Comments