రాష్ట్రానికి చెందిన పది మంది సీనియర్ న్యాయవాదులు, జిల్లా జడ్జిలను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం పంపిన సిఫారసులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న దామా శేషాద్రినాయుడు, తోపాటు జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న 9 మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసినట్లు తెలిసింది.
ఈ సిఫారసులను పరిశీలించిన సుప్రీంకోర్టు శేషాద్రినాయుడు, 9 మంది జిల్లా జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అనంతరం ఫైలు కేంద్ర న్యాయశాఖకు చేరింది. కేంద్ర న్యాయ శాఖ వర్గాలు నిబంధనల ప్రకారం శేషాద్రినాయుడు, అంగీకారాన్ని కోరాయి. న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టేందుకు ఆయన తన అంగీకారాన్ని తెలిపారు. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే, న్యాయమూర్తిగా వీరి నియామకంపై కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. శేషాద్రినాయుడు చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపంలోని గంగన గుంట గ్రామానికి చెందిన వారు.
Comments