తమిళంలో
ఒక సామెత ఉంది. “భారతం
చదివితే తెలుగులో చదవాలి. రామాయణం చదివితే తమిళంలో చదవాలి” అని. తెలుగు భారతం
తమిళ ప్రజల లోపలికి కూడా
ఎలా పోయిందో తెలుసుకోడానికి ఇది మచ్చు తునక.
తెలుగు భారతం అంటే కవిత్రయం
వ్రాసిందే. తెలుగులో కవిత్రయం ఉన్నట్లే, తమిళంలోనూ ఒక కవిత్రయం ఉంది.
వీరు ముగ్గురూ కంబర్, ఒట్తకూత్తర్, పుగళేంది. వీరు ముగ్గురూ మన
కవిత్రయంలాగా ఒకే గ్రంథాన్ని వ్రాసినవారు
కాదు. పైగా దాదాపు ఒకే
కాలానికి చెందిన వారు. కంబర్ రామాయణం
వ్రాసాడు. ఈ రామాయణంపైన తమిళంలో
అనేక విమర్శనాత్మక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఈ విమర్శలలో కంబర్
తెలుగువాడు అనే వాదన కూడా
ఉంది.
తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతాల్లోని లక్ష్మీ మిల్స్ మేనేజింగ్ డైరక్టర్ జి.కె. సుందరం
గారు ‘కంబర్ మండలి’ అనే
పేరుతో కంబరామాయణం ప్రచారం కోసం ఒక సంఘాన్నే
నెలకొల్పాడు. ఆ సంఘం తరఫున
ఒక పుస్తకాన్ని వెలువరించాడు. అందులో కంబర్ తెలుగువాడని, కమ్మవారి
కులంలో పుట్టినవాడని ఉంటుంది. కంబర్ రామాయణం వ్రాయదలచుకున్నప్పుడు
అప్పటి చోళరాజు శివభక్తుడైనందువలన రామాయణ రచనకు ఒప్పుకోలేదని, అందువల్ల
ఆయన వరంగల్లుకు వలస పోయి, కాకతీయుల
ఆస్థానంలో ఉండి, అక్కడే రామాయణాన్ని
రచించాడని ఇంకొక వాదం ఉంది.
కాకతీయుల కాలంలోనే తెలుగులో వచ్చిన రంగనాధ రామాయణం, తమిళంలో వచ్చిన కంబ రామాయణం ఒకదానిపై
ఒకటి ప్రభావం చూపాయనే వాదన ఉంది. తమిళనాడు
ముఖ్యమంత్రి జయలలిత గారు ఒకానొక సందర్భంలో
పత్రికాముఖంగానే కంబర్ తెలుగువాడని ప్రకటించిన
సంగతిని ‘ఈనాడు’ ప్రచురించింది కూడా.
Comments