తెలుగుదేశం పార్టీ 30 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆ పార్టీ యం.పి నందమూరి హరికృష్ణ తన స్థాయి మరచి పార్టీ పైన, పార్టీ నాయకుల పైన, అధినేత పైన తీవ్రమైన విమర్శలు చేసారు. ఎప్పుడో అమావాస్యకు, పౌర్ణమి కి తప్ప పార్టీ కార్యాలయానికి వచ్చే అలవాటు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే తీరిక లేని ఆయన, ఈ రోజు పార్టీ పైన, నాయకుల పైన విమర్శలు చేయటం చూసి, ప్రతి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిగ్గు పడుతున్నాడు. పార్టీ పదవులు పొంది కార్యకర్తలకు గాని, పార్టీకి కాని ఎప్పుడు అందుబాటులో లేని 'హరికృష్ణ'ను ముందుగా నిలదీయాలి.
ఒక్క సారి 'హరికృష్ణ' గతంలోకి తొంగి చూసి కొన్ని నిజాలు చర్చించు కుందాం. 'యన్.టి.రామారావు మరణం తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో తన స్వంత నియోజకవర్గం 'గుడివాడ' నుండి 'యన్.టి,ఆర్ తెలుగుదేశం' పార్టీ తరుపున పోటి చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో హరికృష్ణ, లక్ష్మి పార్వతి, 'చంద్రబాబు నాయుడు' రామారావు ను వెన్నుపోటు పొడిచాడని ఊరూరు తిరిగి గొంతెత్తి అరచినా ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు పట్టించుకోలేదు. హరికృష్ణ, లక్ష్మి పార్వతి చరిత్ర తెలిసిన పార్టీ కార్యకర్తలు రామారావు వారసులుగా వారిని గుర్తించలేదు.
గతాన్ని మరచిన హరికృష్ణ మరల తనకో నీడకోసం 'చంద్రబాబు నాయుడు' పంచన చేరి 'రాజ్య సభ' సీటు కొట్టేసాడు. నందమూరి వారసుడుగా తప్పించి ఇతనికి ఇంకేమైనా ప్రత్యెక అర్హతలు ఉన్నాయా? బావ మంచివాడు కాదనుకున్నప్పుడు మరల 'చంద్రబాబు' నాయుడుకి భజన చేసి ఆయన కాళ్ళు పట్టుకోవటం ఎందుకు?
నందమూరి తారక రామారావు బ్రతికున్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అతడే దిక్కు. ఆయన వారసులకు ఎటువంటి సంబంధం లేదని ప్రజలు, కార్యకర్తలు ఏనాడో తీర్పు చెప్పారు. నందమూరి కుటుంబంపైన ఆధాపడి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ లేదు. కార్యకర్తలే ఆ పార్టీకి బలం. అధికారాన్ని ఆశించిన నాయకులూ పార్టీలోకి వస్తూ పోతూ ఉంటారు, తమకి అనుకున్న పనులు జరగనప్పుడు పార్టీని 'బ్లాక్ మెయిల్' చేయాలని చూస్తారు.
తెలుగుదేశం పార్టీ, అంటే నందమూరి కుటుంబానిదే అంటూ అదేదో వాళ్ళ సొంత పార్టీ లాగా హరికృష్ణ మాట్లాడటం చూస్తుంటే ప్రతి కార్యకర్తకు మండిపోతుంది. 'నందమూరి కుటుంబం' పట్ల పార్టీలో ప్రతి కార్యకర్తకు ఎంతో గౌరవం ఉంది. అది నిలబెట్టుకోవాలని అనుకుంటే ఇక నుండి ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా హరికృష్ణ తెలుగుదేశం పార్టీ పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల ఎంతో సంయమనంగా వ్యవహరించాలి.
హరికృష్ణ వ్యక్తిగతం, అలవాట్లు, చరిత్ర, తెలివితేటలూ ఇవేమీ చంద్రబాబు నాయుడు కాలి గోటికి సరిపోవు. హరికృష్ణ వ్యక్తిగతం, అలవాట్లు, చరిత్ర తవ్వి తీయటం ప్రస్తుతం ఇక్కడ మనకు అనవసరం. ఇక మీదట 'హరికృష్ణ' కూడా ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పార్టీలో చర్చించి పరిష్కరించుకోవాలి తప్ప, పార్టీ ని రచ్చ చేయటం, బజారు కెక్కించటం, చిల్లర ప్రకటనలు చేయటం మానుకోవాలి.
Comments