Thursday, August 4, 2016

ముసునూరు కమ్మ నాయకుల చరిత్ర

ముసునూరు కాపయ నాయకుడు


కాకతీయ సామ్రాజ్యం పతనా నంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు ముసునూరు నాయకులు అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన అంధకార యుగం అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో ముసునూరు కాపయ నాయకుడు, ముసునూరు ప్రోలయ నాయకుడు తురుష్క పాలకులతో స్వాతంత్య్ర పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ వివరించాడు. ఈ ''ముసునూరు యుగం'' రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.

1323 సంవత్సరములో ఆంధ్ర దేశము అల్లకల్లోల పరిస్థితిలో ఉన్నది. ఢిల్లీ సుల్తాను పంపిన ఉలుఫ్‌ఖాన్‌ (మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌) మూడు నెలల ముట్టడి తరువాత ప్రతాపరుద్రుని జయించి బంధించాడు. ఓరుగల్లు నెలల తరబడి దోచుకున్నాడు. అమూల్యమైన కోహినూరు వజ్రము, బంగారము, వజ్రవైఢూర్యములు మొదలగు సంపద 20,000 గుర్రములు, ఏనుగులు, ఒంటెలపై ఢిల్లీ తరలించారు. ప్రతాపరుద్ర మహారాజు, దుర్గపాలకుడు గన్నమ నాయుడు (యుగంధర్‌/ మాలిక్‌ మక్బూల్‌) మొదలగు వారు బందీలుగా ఢిల్లీ తరలుచుండగా మహరాజు నర్మదా నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రోలానీడు :
ప్రోలయ నాయకుని విలస శాసనమందు ఆనాటి తెలుగుదేశపు దయనీయ దుస్థితి వర్ణించాడు. అట్టి విషమ కాలమందు బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన నాయకులను ఐక్యపరిచారు. వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను ఒక కమ్మ సేనానిని ఎన్నుకొన్నారు. ప్రతాపరుద్రుని 72 నాయకులలో ప్రోలానీడు ఒకడు. క్రిష్ణా మండలములోని నూజివీడుకు చెందినవాడు. అతని తండ్రి పేరు పోచినాయకుడు. పోచినాయకునికి ముగ్గురు తమ్ములు. వారు రాజనాయకుడు, కమ్మనాయకుడు మరియు దేవనాయకుడు. దేవనాయకునికి మహావీరుడగు పుత్రుడు కాపయ నాయకుడు జన్మించెను. ముసునూరి కాపానీడు తన పినతండ్రికి చేదోడు వాదోడుగా నిలచి, పేరుప్రఖ్యాతులు గడించాడు. 

ప్రోలానీడు నాయకులందరినీ ఒక తాటిపై తెచ్చి, ఓరుగల్లును విముక్తి గావించేందుకు పలు వ్యూహాలు పన్నాడు. అతనికి ముఖ్య సహచరులుగా అద్దంకి వేమారెడ్డి, కొప్పుల ప్రోలయనాయకుడు, రేచెర్ల సింగమనాయకుడు, మంచికొండ గణపతినాయకుడు, వుండి వేంగభూపతి మొదలగు మహావీరులు తెలుగుదేశమును పారతంత్య్రము నుండి విడిపించుటకు సన్నద్ధులయ్యారు. పలుచోట్ల పెక్కు యుద్ధముల అనంతరం 1326లో తురుష్కులను దక్షిణ భారతమునుండి తరిమివేయుటలో నాయకులు సఫలమైరి. హిందూమతము రక్షించబడెను. దేవాలయములు పునరుద్ధరించబడెను. కోటలు గట్టిబరచబడెను. బ్రాహ్మాణులకు అగ్రహారాలిచ్చారు. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడేవారు

కాపానీడు: 
వయసు మీరిన ప్రోలానీడు రాజ్యాధికారమును కాపానీడికి అప్పగించి రేకపల్లి కోటకు తరలిపోయాడు. ముసునూరివారి విజయములచే ఉత్తేజితులై హొయసల, ద్వారసముద్రము మరియు అరవీటి రాజులు తిరుగుబాటు చేసి తిరిగి వారి వారి రాజ్యములు సాధించుకొన్నారు. ఇస్లాము మతమునకు మార్చబడిన హరిహర మరియు బుక్క రాయలు హోయసల రాజ్యమును జయించి, విద్యారణ్యులవారి బోధనలవల్ల తిరిగి హిందూ మతమును స్వీకరించి ఆనెగొంది విజయనగర రాజ్యము స్థాపించారు. మధురలో జలాలుద్దీను హస్సను స్వతంత్రుడిగా ప్రకటించుకొనెను. సుల్తాను ఉగ్రుడై స్వయముగా పెద్దసైన్యముతో ఓరుగల్లు చేరారు. అచ్చట ప్రబలుచున్న మహమ్మారివల్ల సుల్తానుకు అంటు జాడ్యము వచ్చింది. భయపడిన సుల్తాను తిరిగి దౌలతాబాదుకు తిరుగుముఖము బట్టెను. తనతో వచ్చిన ముల్తాను పాలకుడు మాలిక్‌ మక్బూల్‌ ను ఓరుగల్లు కోటకు అధిపతిగా నియమించి ఢిల్లీకి తిరిగిపోయెను . వెనువెంటనే హోయసల రాజు సహకారముతో కాపయ ఓరుగల్లుపై దాడి చేసి తెలంగాణమంతయును విముక్తి గావించాడు. మాలిక్‌ మక్బూల్‌ ఢిల్లీకి పారిపోయెను. ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు ఆంధ్రదేశాధీశ్వర మరియు ఆంధ్రసురత్రాణ అనే బిరుదులు పొందాడు. ప్రజారంజకముగా పరిపాలించాడు. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించాడు. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళము నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించాడు. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.

పతనము:1345లో హసను గంగు మహమ్మదు బీన్‌ తుగ్లక్‌పై తిరుగుబాటు చేసి, దేవగిరిలో బహమనీ రాజ్యము స్థాపించెను. 1347లో తన రాజధానిని గుల్బర్గాకు మార్చెను. అతని ముఖ్యోద్దేశము దక్షిణాపథమునంతయు ఆక్రమించుట. క్రమముగా తెలుగు నాయకులలో ఐక్యత సన్నగిల్లసాగెను. పాత అసూయలు, కక్షలు తిరిగి తలెత్తాయి. రేచెర్ల సింగమ నాయుడు అద్దంకిపై దండెత్తగా కాపయ కలుగచేసుకొనెను, సింగయకది నచ్చలేదు. అదేసమయాన తుగ్లక్‌ బహమనీ రాజ్యముపై దాడిచేయగా కాపయ సాయమందించెను. బహమనీ సుల్తాను ఎంత కృతఘ్నుడో కాపానీడికి త్వరలో తెలియవచ్చెను. 1350లో సింగమనాయుని ప్రోద్బలముతో అల్లావుద్దీను ఓరుగల్లుపై మొదటిసారి దండెత్తెను. ఇది ఊహించని కాపానీడు వీరోచితముగా పోరాడినను తప్పక సంధిగావించుకొని కైలాసకోటను అల్లావుద్దీనుకప్పగించెను. తుగ్లక్‌ 1351లో మరణించగా మిగుల ఉత్సాహముతో అల్లావుద్దీను పెద్దసైన్యము సమకూర్చుకొని 1355లో మరలా ఓరుగల్లుపై దండెత్తెను. ఆతనికి సింగమ నాయుడు లోపాయకారీగా సహాయపడెను. భువనగిరి సహా పెక్కు కోటలు స్వాధీనపర్చుకొని ఒక సంవత్సరముబాటు అలావుద్దీను తెలంగాణలో సర్వనాశనము గావించెను. 1359లో గుల్బర్గకు తిరిగిపోయి మరణించెను. పిమ్మట మహమ్మదు షా గుల్బర్గలో రాజయ్యాడు. అది అదనుగా కాపానీడు తన కుమారుడు వినాయకదేవుని భువనగిరి మరియు కైలాసకోటలను విముక్తి గావించుటకు పంపెను. ఆతనికి బుక్క రాయలు సాయపడెను. తొలుత విజయములు సాధించినను వినాయక దేవుడు షా సైన్యమునకు చిక్కి మహాఘాతుకముగా వధించబడ్డాడు. కాపానీడికి అదొక పెద్ద విషాదఘాతము. బుక్కరాయల సహాయముతో కాపానీడు బహ్మనీ సుల్తానుపై పెద్ద దాడికి సన్నిద్ధుడయ్యెను. అది తెలిసి మహమ్మదు షా కోపోద్రిక్తుడై తెలంగాణపై దండెత్తెను. రాచకొండ నాయకులు అతనికి సాయమందించారని చరిత్రకారుల అభిప్రాయము. అలాంటి విషమ సమయమున బుక్కరాయలు మరణించెను. విజయనగర తోడ్పాటు లేకపోయెను. కాపానీడు ఓడిపోయి గొల్లకొండ కోటను, నెమలి సింహాసనము, ఎనలేని సంపద, వజ్రవైఢూర్యములు, బంగారము సమర్పించుకొనెను. మహమ్మదు షా రెండు వర్షములు తెలంగాణను అన్నివిధములుగా నాశనము గావించి 1365లో తిరిగిపోయెను. అదే అదనుగా రేచెర్ల సింగమ నాయుడు అతని కుమారులు స్వాతంత్య్రము ప్రకటించుకొని బలహీనపడిన కాపానీడుపై యుద్ధము ప్రకటించిరి. ఖాళీ ఐన కోశాగారముతో, యుద్ధములలో అలసిన సైన్యముతో, విషణ్ణుడైన కాపానీడు పోరుకు తలపడెను. భీమవరము వద్ద జరిగిన పోరులో తెలుగుదేశపు ఐక్యతకు, హిందూమత రక్షణకు, దక్షిణభారతమును పరదాస్యము నుండి విముక్తి చేయుటకు ఎన్నో త్యాగములుచేసిన మహామానధనుడు 1370లో అసువులు బాశాడు.

With Ref: Mallampalli Somasekhara Sharma article published in 'Prajasakthi' . 

Post a Comment