Tuesday, November 11, 2014

ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు ... అరకు లోయ .....

ఊటీ, కొడైకెనాల్. సిమ్లా, కులు, మనాలి, కాశ్మీర్, డార్జీలింగ్, నైనిటాల్, ముస్సొరి .... ఈ పేర్లు చెబితేనే మనసు ఆహ్లాదంతో పరవశించి పోతుంది.. చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, వంపులు తిరిగి ప్రవహించే జలపాతాలు, ఎన్నెన్నో ప్రకృతి ప్రసాదించిన అందాలు కవి కాని వాడికికూడా కవిత్వం తన్నుకొస్తుంది..  జీవితంలో ఒక్కసారైనా వాటిలో కనీసం ఒక్క ప్రదేశానికైనా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిరావాలని అనుకోని వారు ఎవ్వరు ఉండరు.

ఆ ప్రదేశాలకు ఏమాత్రం తీసిపోని అందాలతో పాటు, గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా, ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు 'అరకు' మన కన్నులముందు ఒక అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. 

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, అనే సామెతను నిజం చేస్తూ మనం వేసవి సెలవలకు, విహారయాత్రలకు ఎక్కడి కేక్కడికో వేల రూపాయలు తగలేసి తిరిగొస్తాం! ఒక్కసారి మన రాష్ట్రంలోనే ఉన్న అరకు అందాలను కళ్ళారా చూస్తే 'ఈ జీవితానికి ఈ అనుభూతులు చాలు' అని మనకు అనిపిస్తుంది.

అరకు విశేషాలు, అందాలు ఒకసారి మీ ముందుకు తెస్తున్నాను..


విశాఖపట్నానికి 116 కి.మీ.ల దూరంలో, సముద్రమట్టానికి సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉన్న అరకు లోయ ఆహ్లాదకరమైన వాతావరణముతో, సహజ ప్రకృతి సౌందర్యముతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.


విశాఖపట్నం నుండి అరకు వెళ్ళటానికి  రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే లైను కొత్తవలస-కిరండల్ లో అరకు, అరకు లోయ రెండు స్టేషనులు వస్తాయి. అన్ని ప్రకృతి అందాలు చూడాలంటే వెళ్లేటప్పుడు రైలు వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. రైలు వైజాగ్ లో ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి.  అది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి ఉదయం 6:50 కు బయలుదేరి అలా కొండలు, గుహలు, లోయలు గుహలు దాటుకుంటూ సుమారు 4 గంటలు ప్రయాణం చేసి 10:40 గంటలకు అరకు చేరుకుంటుంది. ఆ ప్రయాణపు   అనుభూతి అనుభవించాలే గాని మాటల్లో చెప్పలేము. ప్రయాణంలో "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది, అది భారతదేశంలో అతి ఎత్తులో వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు. 

తిరుగు ప్రయాణంలో అరకు నుండి విశాఖపట్టణం వచ్చే రోడ్డు మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉన్నాయి. 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటక ఆకర్షణ. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన కటిక జల పాతం, చాపరాయి జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. 

సంవత్సరంలో  ఏ సమయంలోనైనా, ఏ రుతువులోనైనా ఆరకు  వెళ్ళవచ్చు. వేసవిలో వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకోవచ్చు . శీతాకాలం ఐతే అందమైన ప్రకృతి, ఆకు పచ్చని కొండలు, ఎక్కడ చూసినా విరబూసిన అవిసె పూల తోటలతో పసుపు రంగు పులుముకున్నట్టుండే లోయల మధ్య మైదాన ప్రాంతం, నేలను ముద్దాడే మంచు మేఘాలు.... మనసుకు, శరీరానికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. 

అరకులో బస చేయటానికి అన్ని తరగతుల వారికి అనువైన వసతి దొరుకుతుంది, 400 నుండి 2500 రూపాయల వరకు అద్దెతో రూములు లభ్యమౌతాయి. అరకు చుట్టుపక్క అందాలు చూడాలంటే అక్కడ టాక్సీ లు, మినీ వేన్ లు లభ్యమౌతాయి, గైడ్ సౌకర్యం కూడా దొరుకుతుంది.

అరకు సమీపంలో  టైడ గ్రామంలో కొండపై చెక్క, కొయ్యతో చేసిన 'జంగిల్ బెల్స్' కాటేజిల్లో బస చేసినట్లయితే అడవిలో ట్రెక్కింగ్ చేయవచ్చు, పక్షులను తిలకించవచ్చు, గిరిజన సాంప్రదాయ నృత్యాలను వీక్షించవచ్చు.

For more information , please contact Andhra Pradesh Tourism

Visakhapatnam: Railway Station Ph: +91 891-278882

Visakhapatnam: RTC Complex, Visakhapatnam. Ph: +91 891-2788820 Fax: +91 891-2788822 Cell: +91 9848813584.


For Hotels info and reservations: 

http://www.makemytrip.com/hotels/hotels-in-araku_valley-araku_valley.html

http://www.aptdc.gov.in/accommodations.html

http://www.arakuvalleytourism.in/araku-valley-hotels-and-resorts.html


Post a Comment