Thursday, March 6, 2014

కిరణ్ కొత్త పార్టీతో లాభం ఎవరికి?

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ విషయం పై రేపు, మాపు అంటూ రెండు వారాలుగా సాగదీసిన సస్పెన్స్ విడిపోయింది. ఈయన పార్టీ పెడతారా, లేదా? అంటూ బెట్టింగులు కూడా విపరీతంగా సాగాయి. ఎట్టకేలకు కొత్త రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఈయన పార్టీకి స్క్రిప్ట్ లగడపాటి, కథ, మాటలు, పాటలు రాయపాటి, సబ్బం హరి, ఉండవల్లి అరుణకుమార్ అందించారు. 

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంపై ఆయనకన్నా కాంగ్రెస్ పార్టీ బహిష్కృత MP లు యెంతో తొందరపడ్డారు. వీరిలో చాల మందికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి ఏదో ఒక పార్టీ అవసరం ఉంది, ప్రధాన పక్షాల నుండి సీటిచ్చే హామీ లభించ లేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే దమ్మున్న వారెవరు వీరిలో లేరు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే పార్టీ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూశారు, ఎట్టకేలకు వీరికో గూడు దొరికింది. 

కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పై ప్రజల్లో పెద్దగా భ్రమలు కాని, అంచనాలు కాని లెవు. నిజం చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయనకు సన్నిహితులుగా ఉన్నవారెవరికి ఆయన మీద, ఆయన శక్తి సామర్ధ్యాల మీద ఎటువంటి నమ్మకం లేకపోవటంతొ కొందరు కాంగ్రెస్ పార్టీ లోను, కొందరు TDP లోను, అతి తక్కువ మంది YSRCP లోను చేరారు. 

కిరణ్ కుమార్ రెడ్డి తన సామర్ధ్యం తో కాక, కాంగ్రెస్ అధిష్టానం అనుగ్రహం తో, అదృష్టం తో ముఖ్య మంత్రి అయ్యాడనే విషయం అందరికి తెలుసు. ఆంధ్ర ప్రదేశ్ విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా విభజనను వ్యతిరేకించిన వాడిగా సీమాంధ్ర ప్రజల్లో మార్కులు కొట్టేద్దమనుకున్నాడు, విభజన బిల్లు అసెంబ్లీ కి రాకముందే అయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆయనకు ఎంతో కొంత మైలేజీ వచ్చి ఉండేది, ప్రజల్లో కూడా పదవి త్యాగం చేసిన వ్యక్తిగా ప్రజల్లో అయన పట్ల ఏంటో కొంత సానుకూలత ఉండేది. కానీ అయన చివరి నిముషం వరకు పదవిని అంటి పెట్టుకుని, చివరి నాలుగైదు రోజుల్లో ఎన్నో సందేహాస్పద నిర్ణయాలు తీసుకుని డబ్బులు దండుకున్నాడు. ఈయన పదవిలో ఉన్నప్పుడు ఈయన తమ్ముడు 'కలక్షన్ కింగ్' అనే విషయం అందరికి తెలిసిందే! 

నిజం చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి అభ్యర్ధులే లేరు, సీమాంధ్ర JAC నాయకులకు, విద్యార్ధి నాయకులకు సీట్లిస్తామని చెప్పటంలోనే అయన పార్టీ పరిస్థితి అర్ధమైపోతుంది. కిరణ్ కుమార్ రెడ్డిపైన కాని, ఆయన సమర్ధత, సామర్ధ్యాలపై కాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సందేహాలు లెవు. 'సమైఖ్యాంధ్ర ఛాంపియన్' గా ఘనత కొట్టేద్దమనుకున్నాడు కాని, ప్రజలకు ఆయన రంగు బాగా అర్ధమైంది. 

ఆయన తను ముఖ్యమంత్రి పదవి నుండి దిగి పోయే రోజు వరకు, అధిష్టానం చెప్పినట్లుగానే ఆడాడు, రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించే విధంగా తిరుగుబాటు అభ్యర్ధులను పోటీ నుండి విరమింప చేసాడు, TRS అభ్యర్ధి కేశవ రావు ను రాజ్యసభకు పంపటంలో తన సహాయ సహకారాలు పూర్తిగా అందించాడు. బహిరంగంగా ధిక్కార స్వరం వినిపించాడు కాని లోలోపల అధిష్టానానికి విదేయుడుగానే గానే ఉండి తన పనులు చక్కబెట్టుకున్నాడు. 

ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి ఏదో పొడిచేద్దమనే భ్రమలు ఆయనకు కాని, ఆ పార్టీలో చేరే వారికి కాని ఏమి లేవు, కాకపోతే గూడు లేని రాజకీయ పక్షులకు ఒక 'తాత్కాలిక గూడు' దొరికింది. ఏ పార్టీలొ సీట్లు రాని  వాళ్ళు , చెత్త చెదారం సరుకు ఈ పార్టీలో చేరవచ్చు. ఈయన సొంత జిల్లాలోనే ఈయనను నమ్ముకుని ఆ పార్టీలొకి వెళ్ళే నాయకులు ఎవ్వరు లేరు. ఈయనకు ఓట్లు, సీట్లు వస్తాయనుకోవటం భ్రమే! 

కిరణ్ పార్టీకి పడే వోట్లు స్వాభావికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, ఈయన పార్టీలోకి TDP నుండి కాని YSRCP నుండి కాని వెళ్ళే నాయకులూ కానీ ఎవ్వరూ లెరు. తెలుగుదేశం వ్యతిరేక వోట్లు చీల్చటం వలన యెంతో కొంత 'తెలుగుదేశం' పార్టీకి లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే సమైఖ్యాంధ్ర హీరోగా చెప్పుకుంటున్న 'జగన్' కు పడే ఓట్లు,  'సమైఖ్యాంధ్ర ఛాంపియన్' గా చెప్పుకునే కిరణ్ కుమార్ రెడ్డి కొంతవరకు చీల్చ వచ్చు . ఏతా, వాతా చూస్తె ఈయన పార్టీకి లోక్ సత్తా పార్టీ కంటే కొంచెం అటు, ఇటుగా ఓట్లు రావచ్చు. ఈ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులే కరువవుతారు, ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఈ పార్టీ బలం మరింతగా క్షీణించవచ్చు. 

ఈయన రెడ్డి వర్గం ఓట్లు తెచ్చుకొనే అవకాశం ఏమాత్రం కనిపించటం లేదు, కాబట్టి ఆ పరంగా YSRCP కి పెద్దగా నష్టం జరగక పోవచ్చు కాని, సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని హైజాక్ చేసి ఆ ఓట్లు గంప గుత్తగా పొండుదామనుకున్న జగన్ పార్టీకి ఆ విషయంలో కొంత నష్టం జరగవచ్చు. విశ్లేషించి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వలన ఎంతో కొంత 'తెలుగుదేశం' పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది. 
Post a Comment