Thursday, August 15, 2013

చంద్రబాబు నాయుడు రివర్స్ గేర్?


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు, తెలంగాణా రాష్ట్రానికి అనుకూలమే అంటూ ప్రణబ్ ముఖర్జీ కి లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు జూలై 31 తెలంగాణా ప్రకటనకు కట్టుబడి ఉంటూ, ఆ నిర్ణయాన్ని స్వాగతించాడు. ఆ తరువాత పార్టీకి కోస్తా, రాయలసీమ ప్రాంతంలో నష్టం జరుగకుండా రాజధాని విషయంలో, నదీ జలాల విషయంలో మరియు కొన్ని కీలకమైన అంశాలలో ఆ ప్రాంతానికి తగిన న్యాయం చేయాలని హైదరాబాద్ తలదన్నే రాజధాని ఏర్పాటు చేయాలని ప్రకటన చేశాడు. 

కాని ఇవేమీ పార్టీ కార్యకర్తలను, ఆ ప్రాంత ప్రజానీకాన్ని సంతృప్తి పరచలేక పొయాయి. ఊహించిన దానికన్నా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అల్లర్లు జరగటం, ఆందోళనలు ఉధృతం కావటం చంద్రబాబు నాయుడును గందరగోళంలో పడేసింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతం నాయకులూ, వై.సి.పి నాయకులు ఆంధ్ర విడిపోవటానికి చంద్రబాబు లేఖే కారణమంటూ దాడి ప్రారంబించటం ఆ పార్టీ ఆంధ్ర ప్రాంతం నాయకులకు కొంత ఇబ్బంది కలిగించింది. ఈ దాడిని తెలుగుదేశం శ్రేణులు సమర్ధవంతంగా తిప్పి కొట్టలేక పొయయి. 

తెలుగుదేశం పార్టీని తెలంగాణా ప్రాంతంలో బలహీనపరచాటానికి  2001 సంవత్సరంలో YSR కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా ఫోరాన్ని ప్రోత్సహించి, 2004 ఎన్నికలలో తెరాస పార్టీతొ పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రివర్గంలో స్థానం కల్పించి, తద్వారా తెలంగాణా వాదం, తెరాస పార్టీ, కెసిఆర్ బలపడటానికి కారణమయ్యాడని, ప్రస్తుత పరిస్తితికి అతడే కారణం అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నా కాని ఆ వాదాన్నుండి తమకు అనుకూలంగా మలుచుకుని లబ్ది పొందలేక పోయింది. 

YSR ప్రవేశ పెట్టిన పధకాలు కాంగ్రెస్ పార్టీ పధకాలే అంటూ, ముఖ్యమంత్రి ఎవరైనా పార్టీ విధానాల ప్రకారమే నడుచుకుంటారని, ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో  2004 ఎన్నికలలో TRS పార్టీతో పొత్తు, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా వాదులను ప్రోత్సహించటం YSR పాపమే అంటూ ఆ మురికిని YSR కు అంటించి తను తప్పించుకోచూస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం అనుమతి లేకుండా ఏ ముఖ్యమంత్రి కాని, అధ్యక్షుడు కాని ఎన్నికల పొత్తులు, పార్టీ విధి విధానాల విషయాల్లో స్వంత నిర్ణయాలు తీసుకొలేడనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే! ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సరిగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీని, YSR ని ఇరుకునపెట్టే అవకాశం ఉంది. కాని ఆ పార్టీ గందరగోళంలో పడి మరో స్టేట్మెంట్ ఇచ్చింది.

ముందుగా సీమాంధ్ర రాజధాని, ప్యాకేజీ, హైదరాబాద్ నగరంలో సీమాంద్రులకు, ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు రక్షణ విషయాల్లో సరైన ముందస్తు నిర్ణయం తీసుకోకుండానే రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి హడావిడిగా తెలంగాణా నిర్ణయాన్ని ప్రకటించారని చంద్రబాబు నాయుడు ప్రకటించటంతో ఆయన తీవ్ర విమర్శలకు  గురయ్యాడు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని అడ్డుకోవటంలో చంద్రబాబు నాయుడు సరిగా వ్యవహరిమ్చలేక పోయాడు. దీన్ని అలుసుగా తీసుకుని TRS, BJP, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా విషయంలో మాట మార్చాడని ప్రచారం ప్రారంభించాయి. కాని చంద్రబాబు నాయుడు ప్రకటనలో ఎక్కడ తెలంగాణా ఇవ్వకూడదని కాని, ఆంధ్ర ప్రదేశ్ సమైక్యంగానె ఉండాలని ఎక్కడా అనలెదు. 

చంద్రబాబు నాయుడు ప్రకటనలో ఇరు ప్రాంతాల వారి మనోభావాలు దెబ్బ తినకుండా, ఎవరికి అన్యాయం జరుగకుండా, అందరికి న్యాయం జరిగే విధంగా, భవిష్యత్తులో ఇరు ప్రాంతాలవారికి గొడవలు రాకుండా ఒక ఫార్ములా ప్రకటించి, వారిని ఒప్పించి ఆ తరువాత ప్రత్యెక రాష్ట్రం గురించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని చెప్పాడే తప్ప తెలంగాణా రాష్ట్ర నిర్ణయం తప్పని ఎక్కడా చెప్పలెదు. ఈ విషయం ఆ పార్టీ నాయకులు అందరికి అర్ధమయ్యే రీతిలో రెండు ప్రాంతాల్లో చెబితే ఇరు ప్రాంతాల ప్రజల్లో ఏర్పడిన గందరగోళం తీరిపోతుంది. 
Post a Comment