Friday, June 15, 2012

చుక్కాని లేని కాంగ్రెస్ నావ!

ఈ రోజు వెల్లడైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో తీవ్రంగా దెబ్బతిన్న పార్టీ 'కాంగ్రెస్' పార్టీనే! కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిన తరువాత కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ దారుణ పరాజయం 'చిరంజీవి'కి, కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణ కు వ్యక్తిగతంగా పెద్ద దెబ్బగా పేర్కొనవచ్చు.

తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్ధులను నిలబెట్టిన పక్షంలో 'నర్సాపురం', రామచంద్రాపురం స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదే!

ధన బలం, అధికార బలం ప్రదర్శించినా కాని, కాంగ్రెస్ పార్టీకి ప్రత్తిపాడు, మాచెర్ల, ఒంగోలు, అనంతపురం, పోలవరం, రాయచోటి, పరకాల నియోజక వర్గాలలో డిపాజిట్లు కూడా దక్కలేదు. గతంలో గెలిచిన స్థానాల్లో ఇన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోవటంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక రకంగా ఇంతవరకు ఏ పార్టీ, ముఖ్యమంత్రి సాధించని 'చెత్త రికార్డ్' సృష్టించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు కనీసం కొంత వరకు పోటి ఇవ్వగలిగినా తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు, మాచెర్ల, పాయకరావుపేట, ఎమ్మిగనూరు స్థానాల్లో విజయం సాధించి ఉండేది.

రెడ్డి సామాజిక వర్గం ఓట్లు నూటికి నూరుశాతం వై.యస్.జగన్ పార్టీకి పోలయ్యాయని ఈ ఎన్నికల్లో రుజువయ్యింది. ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం అన్ని కీలక పదవులు అనుభవిస్తున్న ఆ కులం వారు కాంగ్రెస్ పార్టీలో 'శల్య సారధ్యం' చేస్తూ జగన్ కు లోపాయకారి సహాయాన్ని అందిస్తున్నారనే విషయం బహిరంగ సత్యమే!

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం ద్వారా ఆర్ధికంగా ప్రయోజనం, రాజ్య సభ్యత్వం పొందాడు. తననే నముకున్న కులం వారిని, కార్యకర్తలను నట్టేట్లో ముంచాడు. చిరంజీవిని నమ్ముకుని, అతని బలం పై యెంతో ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు నట్టేట్లో మునిగింది.

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కేవం అతి తక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి, కాపు వర్గాలనే నమ్ముకుని, అధిక సంఖ్యలో ఉన్న BC, SC వర్గాలను కేవలం వోట్ బ్యాంకు గానే పరిగణించి అధికారానికి, ముఖ్యమైన పదవులకు దూరంగా ఉంచింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే పంధాను అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనం చేసి జగన్ పుంజుకునేందుకు తన సహకారాన్ని అందచేస్తున్నాడు. వెనుక బడిన వర్గాలను, దళితులను దూరం చేసుకోకుండా ఉంటె కాంగ్రెస్ పార్టీకి ఇంత నీచమైన గతి పట్టి ఉండేదికాదు.

చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళు అని వయలార్ రవి చెప్పాడు. కాని అ కళ్ళకు చూపు లేదని ఈ పాటికే అధిష్టానానికి అర్ధమైపోయి ఉంటుంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 'కళ్ళులేని కబోది'లా ఉంది. 

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా కాని, కనీస భాద్యత లేకుండా ఇంకా ముఖ్యమంత్రి పదవిని పట్టుకుని వేళ్ళాడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి, PCC అధ్యక్ష పదవిని వీడని బొత్స, నైతిక భాద్యత వహించని చిరంజీవి లాంటి సిగ్గు, ఎగ్గు, లేని వాళ్ళు ఉన్నంత కాలం రాజకీయాలు ఇలాగే బ్రస్టు పట్టి పోతాయి. 'గెలిస్తే తమ గొప్ప' ఓడిపోతే తమ కేమి సంబంధం లేనట్టుగా వ్యవహరించే జవాబుదారి తనం లేని ఇటువంటి లుచ్చా నాయకులు ఉన్నంత కాలం రాజకీయాల్లో విలువలు నశించి పోతాయి.

తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలలో లాభం కాని నష్టం కాని లేదు. కాని భవిష్యత్తులో జగన్ కు శిక్ష పడి జైల్లో ఉండి, ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అవుతుంది, ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకున్న ఏకైక ప్రత్యామ్నాయం 'తెలుగుదేశం' పార్టీయే.

జగన్ పార్టీ విజయం పాల పొంగు మాత్రమె! జగన్ శిక్షను రాజకీయం గా వాడుకుని సానుభూతి పొంది, విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి, కుల, మతాలని రెచ్చగొట్టి ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించింది. గతంలో తెరాస పార్టీ  కూడా ఇదేవిధమైన తిరుగు లేని విజయాలను సాధించి, ఆ తరువాత బొక్క బోర్లా పడటం అందరికి తెలిసిందే!

జగన్ పార్టీది మూడునాళ్ళ ముచ్చటే!, కాంగ్రెస్ పార్టీని బ్రతికి బట్ట కట్టించే నాధుడే కరువయ్యాడు, రాబోయే రోజుల్లో అంతః కలహాలతో, గ్రూపు రాజకీయాలతో, కులాల కుమ్పట్లతో, వలసలతో ఆ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా దిగజారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీర్ఘ కాలంలో, వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిణామాల వలన అంతిమంగా  ప్రయోజనం పొందే పార్టీ తెలుగుదేశం మాత్రమే!
Post a Comment